రాయలసీమ న్యూస్, నంద్యాల: శ్రీశైలం: శ్రీశైలం జలాశయం సమీపంలోని హైదరాబాద్ ఘాట్ రోడ్డులో కొండచరియల బండరాళ్లు విరిగిపడి రహదారిపై పడిన ఘటన స్థానికులను, ప్రయాణికులను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేసింది. గత రెండు రోజులుగా శ్రీశైలం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు ఈ ఘటనకు కారణమయ్యాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో డ్యామ్ సమీపంలోని కొండ ప్రాంతాల్లో నేల తడిసి, కొండచరియలు సడలిపోయాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి, హైదరాబాద్ ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. బండరాళ్లు రోడ్డుపై పడిన సమయంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటన సమయంలో కారు, బస్సు, లారీ వంటి వాహనాలు అక్కడ గుండా ప్రయాణించి ఉంటే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కొండచరియల ధాటికి వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడేదని వారు పేర్కొంటున్నారు.
శ్రీశైలం జలాశయం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే ప్రతిసారి కొండచరియల బండరాళ్లు రహదారిపై పడటం కొత్తేమీ కాదు. అయితే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు, ప్రమాద సూచిక బోర్డులు, రక్షణ గోడలు వంటి భద్రతా చర్యలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కొండచరియలు విరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, రహదారి పక్కన ఉన్న బండరాళ్లను ముందుగానే తొలగించే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం సమీపంలోని ఘాట్ రోడ్డు రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర మార్గాల్లో ఒకటిగా భావించబడుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.













