రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల: జిల్లాలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి IAS సూచించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా, డి ఆర్ ఓ రాము నాయక్, వీఆర్వోలు, ఏ ఈ ఆర్‌లతో కలిసి సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి IAS సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, నిబంధనల అమలు, ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు.

ఎన్నికల విధుల పరిశీలనలో భాగంగా బీఎల్ఓల పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, వివిధ ఫారమ్‌ల పరిష్కారం, నోటీసుల విచారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న గృహసమీకరణ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సవరణల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచనలు చేశారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో బీఎల్ఓలు తమ విధులపై స్పష్టమైన అవగాహనతో, అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సక్రమంగా సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు.
రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
జిల్లాలో సమర్థవంతంగా SIR ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ వేగవంతం చేయాలని ఎన్నికల పరిశీలకురాలు సూచించినట్లు అధికారులు తెలిపారు. హియరింగ్ కేసుల పరిష్కారంలో ఆలస్యం కాకుండా, ప్రతి కేసును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా బీఎల్ఓలు, వీఆర్వోలు, ఏ ఈ ఆర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా సూచించారు. ప్రజలు కూడా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, తమ పేర్లు, వివరాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.














