రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఏపీ ఎన్జీవో కార్యాలయంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ దాడుల్లో 22 మంది పేకాట రాయల్ని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం ₹57,400 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిలో విశ్రాంత ఉద్యోగులతో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కార్యాలయ ఆవరణలోనే పేకాట ఆడుతున్న సమాచారం అందడంతో, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
దాడుల అనంతరం పట్టుబడ్డ వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు సూచించినట్లు సమాచారం.
తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఏపీ ఎన్జీవో కార్యాలయాన్ని జూదం, తాగుడు వంటి కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నట్లు స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఇలాంటి కార్యకలాపాలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
సర్కారు కార్యాలయ పరిధిలోనే పేకాట శిబిరం నడుస్తుండటం, అందులో సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు కూడా పాల్గొనడం పట్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. సంఘం కార్యాలయాల వినియోగంపై కఠిన నియమాలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ ఘటనపై సంబంధిత శాఖలు, ఉద్యోగుల సంఘాలు స్పందించి, బాధ్యులపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ధర్మవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనతో ఏపీ ఎన్జీవో కార్యాలయాల నిర్వహణ, పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.













