రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ వైద్య సేవలు, పట్టణ పారిశుధ్యం, పోలీస్ శాఖ, దివ్యాంగుల సంక్షేమం వంటి రంగాలకు అదనపు వనరులను సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) నిధులు, సహకారంతో సుమారు రూ.2.025 కోట్ల విలువైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
పట్టణ పారిశుధ్య నిర్వహణను బలోపేతం చేయడానికి ధర్మవరం మున్సిపాలిటీకి SEIL సంస్థ సహకారంతో చెత్త సేకరణ కోసం 16 ఎలక్ట్రిక్ వాహనాలు, రెండు వాటర్ ట్యాంకర్లు అందించనున్నారు. ఈ వాహనాలు పట్టణంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు నీటి సరఫరాకు కూడా ఉపయోగపడనున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని భవనాల నిర్వహణ, మరమ్మతులకు అవసరమైన పెయింట్‌ను Eagle Coats సంస్థ అందించింది.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా SEIL సంస్థ ఐదు Bolero వాహనాలు, ఒక Droneను సమకూర్చింది. ఈ వాహనాలు, డ్రోన్ పోలీసుల క్షేత్రస్థాయి విధుల నిర్వహణ, పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఉపయోగపడనున్నాయి.
దివ్యాంగుల స్వావలంబనకు తోడ్పడేలా HPCL సంస్థ హ్యాండ్ కంట్రోల్ సదుపాయాలతో మార్పులు చేసిన 10 ఆటోరిక్షాలు, 10 స్కూటీలను అందించనుంది. వీటి మొత్తం విలువ సుమారు రూ.49 లక్షలు. ఈ వాహనాలు దివ్యాంగులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు దోహదపడనున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. Gland Pharma సంస్థ సుమారు రూ.1.50 లక్షల విలువైన రెండు Baby Warmerలను అందించనుంది. ఇవి నవజాత శిశువుల సంరక్షణకు ఉపయోగపడనున్నాయి. Dr. Reddy’s సంస్థ సహకారంతో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునికీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. వైద్య సేవలు, రోగ నిర్ధారణ, టీకాల కార్యక్రమాలకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా కార్పొరేట్ సంస్థల సహకారాన్ని సమీకరించి ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా వినియోగించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టి సారిస్తున్నారు. పట్టణ పారిశుధ్యం, నీటి సరఫరా, పోలీస్ శాఖ అవసరాలు, దివ్యాంగుల సంక్షేమం, ప్రభుత్వ వైద్య సేవల బలోపేతం వంటి రంగాల్లో చేపడుతున్న ఈ ప్రయత్నాలు ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడనున్నాయి. ప్రజలకు అవసరమైన సదుపాయాలను గుర్తించి, వాటి కోసం అదనపు వనరులను సమీకరిస్తూ ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి చేస్తున్నారు.













