హిందూపురం పట్టణంలో అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు సేవలు అందించేందుకు క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.22.25 కోట్ల వ్యయంతో 50 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. సెప్టెంబరు 12న కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌ విధానంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.

క్రిటికల్‌ కేర్‌ సదుపాయం లేకపోవడంతో ఇప్పటివరకు హిందూపురం పరిసర ప్రాంతాల రోగులను అనంతపురం, బెంగళూరు వంటి నగరాలకు తరలించాల్సి వచ్చేది. దాదాపు 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో రోగుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవి. ప్రయాణంలో ఆలస్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవతో క్రిటికల్‌ కేర్‌ కేంద్రాన్ని మంజూరు చేయించారు.

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంసీహెచ్‌ ఆసుపత్రి పై అంతస్తులో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. సెంట్రల్‌ ఏసీ సదుపాయంతో ఈ భవనాన్ని రూపకల్పన చేశారు. ఇందులో ఐసీయూ, డయాలసిస్‌, ఆర్థోపెడిక్‌, గైనిక్‌ విభాగాలు ఏర్పాటు చేశారు. వెంటిలేటర్‌ సదుపాయాలు, రెండు ఆపరేషన్‌ థియేటర్లు కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు.

ఈ క్రిటికల్‌ కేర్‌ కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయాలంటే దాదాపు 20 మంది వైద్యులు, 60 మంది ఇతర సిబ్బంది అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని పరికరాలు, అవసరమైన వస్తువులు ఆసుపత్రికి చేరుకున్నాయి. వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తయిన వెంటనే సేవలు ప్రారంభం కానున్నాయి.

హిందూపురం ఆసుపత్రిని రాష్ట్రంలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, రోగులకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ లక్ష్యంతో ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం, ఎన్టీఆర్‌ బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ విభాగాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయి.

అలాగే ఆసుపత్రికి అవసరమైన పరికరాలను తన సొంత నిధులతో ఎమ్మెల్యే కొనుగోలు చేసి అందజేశారు. క్రిటికల్‌ కేర్‌ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే హిందూపురం వైద్య సేవలకు ఇది మరో మణిహారంగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం సూచన మేరకు ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని

అని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆఫ్తాబ్‌ తెలిపారు.