రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంవలి కాలనీలో ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కదిరి టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీడియో ప్రొజెక్టర్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమంలో సైబర్ మోసాల నుంచి ప్రజలు ఎలా రక్షించుకోవాలి, మహిళలు, బాలబాలికల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అత్యవసర సేవల కోసం డయల్-112 వినియోగం, మహిళల భద్రతకు అందుబాటులో ఉన్న సేవలు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించే విధానం వంటి అంశాలపై వీడియోల ద్వారా వివరంగా అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తతే ప్రధాన రక్షణ అని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను నమ్మకూడదని, తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని స్పష్టంగా తెలియజేశారు. ఏదైనా అనుమానాస్పద సంఘటన ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్-112ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
మహిళలు, బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి స్థాయిలో జాగ్రత్తలు అవసరమని కార్యక్రమంలో వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో నిర్లక్ష్యం, అవివేకం కారణంగా నేరాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, బాధ్యతాయుత వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అప్రమత్తతే భద్రత, అవగాహనే రక్షణ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు స్పందించారు. తమ కుటుంబాలను, తమ సమాజాన్ని సురక్షితంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యతగా పోలీసులు మరోసారి గుర్తుచేశారు.













