రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: కదిరి: ప్రతి నెల చౌక దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే బియ్యం పూర్తిగా ఉచితం అయినప్పటికీ, దాన్ని తెచ్చుకోవడానికి పేదలు రూ.వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నివాస ప్రాంతం నుంచి 2 కి.మీ. దూరం లోపలే రేషన్ దుకాణం అందుబాటులో ఉండాలి. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్ల నుంచి 5 కి.మీ. దూరంలో రేషన్ దుకాణాలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి నెలా అంత దూరం వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సి రావడంతో పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఈ-పాస్ యంత్రం పనిచేయకపోయినా, లబ్ధిదారుల చేతి వేలిముద్రలు సరిగా పడకపోయినా మరుసటి రోజు మళ్లీ వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఉచితంగా లభించాల్సిన బియ్యానికి ప్రయాణ ఖర్చులు, రోజువారీ కూలి నష్టం కలిపి పేదలకు భారంగా మారుతోంది.
గత పదేళ్లలో ప్రభుత్వాలు వివిధ కాలనీల పేరిట పేదలకు పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాయి. అర్హులైన లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ కొత్త కాలనీలకు రేషన్ దుకాణాలు దూరంగా ఉండటం సమస్యగా మారింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్లకు మ్యాపింగ్ చేశారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్ చేసిన ఇళ్ల పరిసర ప్రాంతాల్లోనే రేషన్ దుకాణాలు ఉండాలి. కానీ ఇళ్లకు నంబర్లు కేటాయించకపోవడంతో కొత్త దుకాణాల ఏర్పాటుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని గత ఏడేళ్లుగా ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల స్థాయిలో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా వేలాది మంది లబ్ధిదారులు ఇప్పటికీ దూర ప్రయాణాలకే పరిమితమవుతున్నారు.
ధర్మవరం పట్టణానికి 3 నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న కుణుతూరు, తుంపర్తి కాలనీల్లో సుమారు 3,500 నుంచి 4,000 మంది నివాసం ఉంటున్నారు. ప్రతి నెలా వీరు పట్టణంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రానుపోనూ ఒక్కో కుటుంబానికి రూ.100 నుంచి రూ.150 వరకు ప్రయాణ ఖర్చు అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరు నెత్తిన బియ్యం మూటలు మోసుకుంటూ కాలినడకన ఇంటికి చేరుతున్నారు.
పుట్టపర్తిలోని మామిళ్లకుంట క్రాస్ ప్రాంత ప్రజలు రెండు కి.మీ. దూరంలో ఉన్న కప్పలబండ రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఆటోకు రూ.100 చెల్లించి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీ ప్రజలు కూడా కి.మీ. దూరంలో ఉన్న బడేనాయక్‌తండాకు వెళ్లి బియ్యం తీసుకెళ్తున్నారు.
ఈ సమస్యపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వంశీకృష్ణారెడ్డి స్పందించారు.













