రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రత కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ శివ నారాయణస్వామి పర్యవేక్షణలో కదిరి టౌన్ సీఐ బి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ చర్యలు అమలు చేస్తున్నారు.
జూలై 15 నుంచి ఆగస్టు 31 వరకు వివిధ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై విస్తృతంగా కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్లు పోలీసులు వివరించారు. ఈ కాలంలో ట్రాఫిక్ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఈ వ్యవధిలో మొత్తం 482 ట్రాఫిక్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 68 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల ద్వారా మొత్తం రూ.5,43,740 జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవింగ్‌కు పాల్పడిన వారిలో 7 మందికి జైలు శిక్షలు విధించబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 414 కేసులు నమోదు చేసి, సంబంధిత వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
నేర ప్రవర్తనకు అలవాటు పడిన వారిపై కూడా పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. మొత్తం 38 మందిపై బాండ్‌ఓవర్ చర్యలు తీసుకుని, భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా హెచ్చరించారు. పూచీకత్తు షరతులు ఉల్లంఘించిన 5 మందికి పూచీకత్తు ఫోర్‌ఫీచర్ నోటీసులు జారీ చేశారు. పూచీకత్తు షరతులు ఉల్లంఘించిన ఒకరిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
కదిరి పట్టణంలో రౌడీషీటర్ నెం.349 షేక్ ముజాహిద్ @ ముజ్జుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిరంతరం నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇలాంటి కఠిన చట్టాలను ప్రయోగించి, ప్రజల భద్రతను కాపాడుతున్నట్లు తెలిపారు.
రాత్రివేళ నేరాల నియంత్రణ కోసం నైట్ బీట్‌లను మరింత బలోపేతం చేశారు. సాధారణ నైట్ బీట్‌లతో పాటు అదనంగా మఫ్టీ, లర్కింగ్ నైట్ బీట్‌లను ఏర్పాటు చేసి, ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. దొంగతనాలు, రాత్రి సమయంలో జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
ప్రజలతో మమేకం కావడానికీ పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు, బాలల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, వినాయక చవితి ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.













