పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి ఎస్. సవిత తెలిపారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మంజూరుకు సంబంధించి మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

పెనుకొండ మండలంలోని మక్కాజపల్లి, కొండంపల్లి, గోనిపెంట తండాలతో పాటు గోరంట్ల మండలంలోని బీఎన్ తండా, కొమ్మలతండా, బూచేపల్లి తండా, భీమ్లా నాయక్ తండా, గంగంపల్లి తండా, దాసరిపల్లి తండా, మిషన్ తండా తదితర ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని గిరిజన తండాలను ఈ నిధుల ప్రయోజనం అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తండాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు గణనీయంగా తగ్గడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడుతుందని మంత్రి సవిత అన్నారు. గిరిజన తండాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల సమగ్ర అభివృద్ధికి రూ.3 కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని అన్ని తండాల అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు తీసుకువచ్చి, మౌలిక వసతులను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.