రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అర్థవార్షిక నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, కేసుల దర్యాప్తు పురోగతిపై కీలక సూచనలు చేశారు. జిల్లా పరిధిలో నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, కోర్టు విచారణల స్థితిగతులపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
నేరస్తులకు పోలీసులంటే భయం ఉండాలి... ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరగాలి
జిల్లాలో ఆస్తి నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పెండింగ్ కేసులు, POCSO, హత్య, వైట్ కాలర్, మిస్సింగ్ కేసులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలు, కోర్టు విచారణల పురోగతిని ఆయన విశదంగా పరిశీలించారు.
చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులను వేగంగా ఛేదించి బాధితులకు ఆస్తులు తిరిగి అందజేయాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తుల కదలికలను నిశితంగా గమనించి, అవసరమైతే బైండోవర్, PD Act వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం గ్రామాలు, పాఠశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హైవే పెట్రోలింగ్, నైట్ బీట్‌లు, సరిహద్దు చెక్‌పోస్టులను మరింత పటిష్ఠంగా నిర్వహించి, ప్రమాదాలు, నేరాలను ముందస్తుగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు నిర్వహించి, కోర్టుల్లో శిక్షల శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాల వినియోగం ద్వారా కేసులను బలపరచాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా పెనుకొండ హైవే రాబరీ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు అధికారులు, గ్యాంగ్ రేప్ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలు మరియు నగదు బహుమతులతో సత్కరించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, న్యాయపరమైన సేవల మెరుగుదల కోసం సమన్వయంతో, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పోలీసు బృందాన్ని ఆహ్వానించారు.













