పుట్టపర్తి పట్టణంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తెలిపారు. నదిలో మురుగు, చెత్త పేరుకుపోవడం వల్ల ప్రాణికోటికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో పారిశుధ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి సమీపంలో చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న సుందరీకరణ, పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్రావతి నదిలో క్లీనింగ్ పనులను జేసిబి యంత్రంతో ప్రారంభించారు.

చిత్రావతి నదిలో చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతర పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశించారు. నదిలోకి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నది పరివాహక ప్రాంతంలో పారిశుధ్యాన్ని కాపాడేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆమె కోరారు.

చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇప్పటికే పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో మూడు మురుగు శుద్ధి కేంద్రాలు ఉన్నప్పటికీ ఇవి ఏవీ పనిచేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. కనీసం ఒక కేంద్రం తక్షణం పనిచేసేలా చేయడానికి రూ.50 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అవి మంజూరు అయిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి మురుగు వ్యవస్థ సమస్యలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పాడైన మురుగు శుద్ధి కేంద్రాలను త్వరగా మరమ్మతులు చేపట్టే విధంగా ప్రభుత్వానికి తగిన నివేదికలు పంపాలని సూచించారు.

పుట్టపర్తి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన, పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. చిత్రావతి పరివాహక ప్రాంతంలో సుందరీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి.