రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో అంతర్‌జిల్లా వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ సీరియల్ దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 47 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు, మొత్తం సుమారు రూ.84 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టయిన నిందితుడిని చిత్తూరు జిల్లా చౌడేపల్లి వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఒంటిపులి శ్రీనివాసులుగా గుర్తించినట్లు తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు 2016 నుంచి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. ప్రధానంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో ఒంటరిగా చోరీలు జరిపేవాడని అధికారులు వివరించారు. పగటి సమయంలో కాలనీలు, నివాస ప్రాంతాల్లో తిరుగుతూ ఇళ్ల పరిస్థితిని గమనించి, ఇంట్లోని వారు బయటకు వెళ్లి, ఇల్లు తాళం వేసి ఉందని నిర్ధారించుకున్న అనంతరం రాత్రి సమయంలో ఆ ఇంట్లో చోరీ చేసేవాడని దర్యాప్తులో తేలింది.
నిందితుడికి శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి, చిత్తూరు, పాకాల, మదనపల్లె, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాల్లో నమోదైన 20కి పైగా ఇళ్ల దొంగతనం కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నిందితుడు పీలేరు, బుక్కపట్నం, ధర్మవరం ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తూ, అక్కడ కూడా ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
శ్రీకాళహస్తిలో గతంలో ఓ చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన అనంతరం, పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు తరచూ నివాస ప్రాంతాలను మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఉంటున్నాడని అధికారులు తెలిపారు. వరుస ఇళ్ల దొంగతనాల కేసులను ఛేదించేందుకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సీకే పల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బృందం నిరంతర నిఘా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థవంతమైన దర్యాప్తుతో కేసులను ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయగలిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి వస్తువులను ఆయా కేసులతో అనుసంధానం చేసి, అవసరమైన న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం చట్ట ప్రకారం అసలు బాధితులకు తిరిగి అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన సీకే పల్లి ఎస్‌ఐ సత్యనారాయణ, ఎస్‌ఓజీ బృందం, ప్రత్యేక పోలీస్ బృందం, సీకే పల్లి పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వృత్తిపరమైన దర్యాప్తు, సమన్వయంతో కూడిన పోలీస్ చర్యలు ఆస్తి నేరాలను ఛేదించడంలో, అలవాటైన నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.













