శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడం, నేరాలను పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సస్పెక్ట్ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సికేపల్లి పోలీస్ స్టేషన్‌లో ధర్మవరం డీఎస్పీ పాల్గొన్నారు. నేర ప్రవర్తనను పూర్తిగా విడనాడి, చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని ఆయన సూచించారు. సమాజంలో శాంతి, భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ పాల్పడవద్దని హెచ్చరించారు.

పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే, ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా కొత్త క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.

అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రతి అనుమానాస్పద చర్యను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

ప్రజల భద్రతే మా ప్రధాన బాధ్యత... నేరాల నిర్మూలనే మా లక్ష్యం.

ఈ కార్యక్రమాలు, నిఘా చర్యల ద్వారా జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఈ వివరాలను విడుదల చేసింది.