రాయలసీమ న్యూస్, తిరుపతి: చంద్రగిరి: చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టే విధానంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్యాయత్నం కేసులో అరెస్టైన ముద్దాయిలను ప్రెస్ మీట్ నిర్వహించకుండా నేరుగా కోర్టుకు తరలించడంపై పలు వర్గాల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో చిన్న కేసులైనా నమోదు అయితే, సంబంధిత ముద్దాయిలను ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముందు చూపుతూ వివరాలు వెల్లడించే పోలీసులు, ఇప్పుడు పెద్ద నేరం జరిగినప్పటికీ ముద్దాయిలను మీడియా ముందు ఎందుకు చూపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులో అరెస్టైన వారిని ప్రెస్ మీట్ లేకుండా కోర్టుకు తరలించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పలుకుబడి ఉన్న ముద్దాయిలను ప్రెస్ మీట్‌లో చూపించకుండా నేరుగా తరలించడం ఏమిటని స్థానికంగా చర్చ సాగుతోంది. సామాన్య ముద్దాయికి ఒక విధమైన వ్యవహారం, శారీరక బలం, ఆర్థిక బలం ఉన్న ముద్దాయికి మరో విధమైన వ్యవహారమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వ్యవహారంలో సమానత్వం ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సాధారణ ప్రజలను ఓపెన్ బూసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చెకింగ్ పేర్లతో పోలీసులు కఠినంగా తనిఖీలు చేసి, జరిమానాలు విధించి, కోర్టులో చలానాలు కట్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో పోలీసులు మీడియాకు వివరాలు అందిస్తూ, ముద్దాయిలను కూడా చూపించే పరిస్థితి ఉండగా, ఇప్పుడు పెద్ద నేరాలకు పాల్పడిన వారిపై అదే విధానం ఎందుకు పాటించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
బైక్ దగ్ధం చేసిన దుండగులను కూడా ప్రెస్ మీట్ నిర్వహించకుండా నేరుగా రిమాండ్‌కు తరలించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టే విషయంలో స్పష్టమైన విధానం ఉండాలని, కేసు స్వభావం, నేర తీవ్రత ఆధారంగా కాకుండా అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేయాలని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన ఈ పరిణామాలపై ప్రజలు, పౌరసంఘాలు, స్థానిక నాయకులు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దాయిల ప్రదర్శన, ప్రెస్ మీట్ నిర్వహణపై పోలీసుల నుంచి స్పష్టమైన వివరణ రావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













