చంద్రగిరి: డయల్-112కు వచ్చిన అత్యవసర సమాచారంపై క్షణాల్లో స్పందించిన తిరుపతి జిల్లా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, చంద్రగిరి పోలీసు సిబ్బంది ఆపదలో ఉన్న మహిళను సురక్షితంగా రక్షించి మరోసారి తమ సేవా నిబద్ధతను చాటుకున్నారు. చంద్రగిరి ప్రాంతంలో బావిలో దూకిన మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ కె. చలపతి ధైర్యసాహసం ప్రశంసలు పొందుతోంది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి జిల్లా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చంద్రగిరి పోలీసులకు అలర్ట్ వెళ్లింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని అంచనా వేసిన హెడ్ కానిస్టేబుల్ కె. చలపతి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దూకి, ఆ మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

బావి నుంచి బయటకు తీసిన అనంతరం, ఆ మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వేగవంతమైన స్పందన, సమయస్ఫూర్తి, అప్రమత్తతతో పోలీసులు చేపట్టిన ఈ రక్షణ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది.

విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసం, సేవాభావాన్ని ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ కె. చలపతితో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఈ ఘటనను ఎస్పీ ప్రశంసిస్తూ, ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ పరమ ధ్యేయం. ఆపదలో ప్రతి అడుగులోనూ ప్రజలకు అండగా తిరుపతి జిల్లా పోలీసులు ఉంటారు

అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచించారు. క్షణికావేశంలో ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా, అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సంబంధిత అధికారుల సహాయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డయల్-112 ద్వారా వచ్చే కాల్స్‌కు తిరుపతి జిల్లా పోలీసులు వేగంగా స్పందిస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చంద్రగిరిలో జరిగిన ఈ ఘటన, అత్యవసర సేవల ప్రాముఖ్యతను, పోలీసు శాఖ సేవా ధృక్పథాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది.