రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో కొత్తగా నిర్మించిన ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రధమంగా తిరుమలలో ఏర్పాటు చేసిన పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భక్తుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చేందుకు ఈ కేంద్రాన్ని రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తర్వాత నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ బస్సులను Reliance, Bharat Biotech సంస్థలు విరాళంగా అందించాయి. ప్రారంభోత్సవం అనంతరం సీఎం స్వయంగా ఈ బస్సుల్లో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.
తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తరువాత తిరుమలలో కొత్తగా నిర్మించిన ఎస్వీ మ్యూజియం వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మ్యూజియాన్ని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఎస్వీ మ్యూజియం జీ+3 అంతస్తుల భవనంగా నిర్మించబడింది. మొత్తం 19 గ్యాలరీలతో రూపొందించిన ఈ మ్యూజియంలో సుమారు 14 వేల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచినట్లు అధికారులు వివరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ, శాసనాలు, సంప్రదాయ కళారూపాలకు సంబంధించిన అనేక అరుదైన వస్తువులు ఇందులో భాగంగా ఉన్నట్లు తెలిపారు.
తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభవాన్ని మరింత సమృద్ధిగా అందించేందుకు ఈ మ్యూజియం ఉపయోగపడుతుందని టిటిడి వర్గాలు భావిస్తున్నాయి. కొత్త మ్యూజియం ప్రారంభంతో తిరుమల సందర్శనలో మరో ముఖ్య ఆకర్షణగా ఇది నిలవనుందని పేర్కొన్నారు.













