కల్తీ నెయ్యి అక్రమార్కుల పై వేటు!

ప్రత్యేకాధికారులను నియామించిన ప్రభుత్వం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఫ్యాక్టరీస్, బాయిలర్స్‌ విభాగానికి చెందిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాలపై విచారించడానికి విచారణ అధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్‌ బి.ఉమామహేశ్వరరావును నియమించింది. ప్రజెంటింగ్‌ అధికారిగా ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ కార్యాలయం జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహనరావు పేరును ప్రకటించింది. వీరు మూడు నెలల్లోగా విచారణ పూర్తిచేసి, తదుపరి చర్యలకు నివేదిక సమర్పించాలని సూచించింది. తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఫ్యాక్టరీస్, బాయిలర్స్‌ విభాగానికి చెందిన ప్రస్తుత విశ్రాంత డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కర్రి పరమేశ్వరరావు సహా ఏడుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు గత మేలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించగా, వారంతా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా విచారణ, ప్రజెంటింగ్‌ అధికారులను నియమించింది. 

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వైష్ణవి డెయిరీకి లైసెన్సుల జారీ, నవీకరణ, ధ్రువపత్రాల పరిశీలనకు ఫ్యాక్టరీస్, బాయిలర్స్‌ అధికారులు.. డెయిరీ నుంచి మామూళ్లు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. అప్పట్లో నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కర్రి పరమేశ్వరరావు, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శివశంకరరెడ్డి, విశ్రాంత ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రమేశ్‌బాబు, బాయిలర్స్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మేడిచెర్ల సత్యనారాయణ, బాయిలర్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఎంవీఎల్‌ నరసింహరాజు, టి.సుష్మ, పి.రాంబాబుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. సిట్‌ అధికారుల సోదాల్లో శ్రీవైష్ణవి డెయిరీలో ఓ డైరీ దొరికింది. అందులో ఫ్యాక్టరీస్, బాయిలర్స్‌ విభాగం సహా వివిధ శాఖల్లోని ఏ అధికారికి ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలిచ్చారు, నెలవారీ మామూళ్లు ఎంత సమర్పించుకున్నారో అందులో రాసి ఉంది.