తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ, టీటీడీ, ఇతర విభాగాలు కలిసి సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందస్తు ప్రణాళికతో బందోబస్తు అమలు చేస్తున్నారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. భక్తుల ఆధ్యాత్మిక భావాలు, శ్రీవారి సేవ పవిత్రత, ఆగమ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తిరుమలలోని PAC-4 ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కేంద్రంగా చేసుకుని భద్రతా పరిస్థితులను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి–తిరుమల ప్రాంతాలను సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అనుసంధానించి భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు, కీలక ప్రాంతాల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. అవసరమైన ప్రాంతాలకు తక్షణమే అదనపు బలగాలను మోహరించేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.

గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల, తిరుపతిలో శాంతిభద్రతల పరిరక్షణకు సుమారు 4,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని విధుల్లో మోహరించారు. నాలుగు మాడ వీధులు, ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఇన్నర్–ఔటర్ రింగ్ రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, ఘాట్ రోడ్లతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాడ వీధుల్లో రద్దీ పెరిగినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్, బాటగంగమ్మ, కృష్ణతేజ, ఏటీసీ సర్కిల్ తదితర ప్రాంతాల వరకు క్యూలైన్లను విస్తరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా అదనంగా 40,000–50,000 మంది భక్తులను క్రమపద్ధతిలో మాడ వీధుల వైపు తరలించే సామర్థ్యాన్ని కల్పించారు.

రాంభగీచా, మేదరమిట్ట తదితర 15 ప్రెజర్ పాయింట్లను గుర్తించి అక్కడ సబ్-కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలోనైనా రద్దీ ఒక్కసారిగా పెరిగితే వెంటనే అదనపు సిబ్బందిని తరలించి పరిస్థితిని నియంత్రించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

జీఎన్సీ టోల్‌గేట్ వద్ద వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తూ తిరుమలలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. తిరుమలలో పార్కింగ్ సామర్థ్యం పూర్తయిన అనంతరం తిరుపతిలోని దేవలోక్, బ్రేడెంట్, భారతీయ విద్యాభవన్, మున్సిపల్ స్టేడియం తదితర ఐదు ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను తిరుమలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.

భారీ రద్దీని ఆసరాగా చేసుకుని జరిగే దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు సుమారు 250 మంది ప్రత్యేక క్రైమ్ సిబ్బందిని రంగంలోకి దించారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ట్యాబ్‌ల్యాబ్ సిస్టమ్స్, డిజిటల్ వేలిముద్రల స్కానర్లను వినియోగిస్తూ అనుమానితులను గుర్తించే చర్యలు చేపట్టారు.

చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా కీలక ప్రాంతాల్లో ప్రత్యేక చైల్డ్ ట్యాగింగ్, జియో ట్యాగింగ్ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. తప్పిపోయిన వారిని త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు.

PAC-4 ప్రధాన కంట్రోల్ రూమ్ వేదికగా తిరుపతి జిల్లా పోలీస్, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాలతో పాటు విద్యుత్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖల ప్రతినిధులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే సంబంధిత శాఖలు సమన్వయంతో స్పందించి పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.

గరుడ వాహన సేవ భద్రతా ఏర్పాట్లను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CV&SO) శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్., ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నాలుగు మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, క్యూలైన్లు, రద్దీ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలను స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులను, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

భక్తుల భద్రత విషయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, రద్దీ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, శ్రీవారి సేవ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

గరుడ వాహన సేవను తిలకించేందుకు 3 లక్షలకు పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భక్తులు వీలైనంత వరకు ప్రజా రవాణా, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు విజ్ఞప్తి చేశారు. క్యూలైన్లలో క్రమశిక్షణ పాటిస్తూ, పోలీస్ మరియు టీటీడీ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

శ్రీవారి గరుడ వాహన సేవ సందర్భంగా భక్తులు ఓపిక, సహనంతో వ్యవహరించాలని, స్వామివారు భక్తుల వద్దకే విచ్చేసి దర్శనమిస్తున్నందున ఎవరూ తొందరపడకుండా, తోపులాటకు దారితీసే విధంగా వ్యవహరించకుండా ప్రశాంతంగా తమ వంతు కోసం వేచి ఉండాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తి, సహనం, క్రమశిక్షణతో శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలని, శ్రీవారి సేవ పవిత్రతను కాపాడుతూ పోలీస్, టీటీడీ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాను.