ముంబయి: గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ ఓ మోడల్‌ ఎయిర్‌పోర్టులోనే పట్టుబడింది. అనుమానాస్పద ప్రవర్తనతో ఎయిర్‌పోర్టు అధికారుల దృష్టికి వచ్చి, చివరికి భారీ పరిమాణంలో నిషేధిత మాదకద్రవ్యాన్ని తరలించే యత్నం బహిర్గతమైంది. ఈ ఘటన ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

కస్టమ్స్‌ శాఖ, ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ సమాచారం ప్రకారం.. కేరళకు చెందిన 28 ఏళ్ల హర్ష సన్నీ అనే మోడల్‌ బాంగ్ కాక్ నుంచి ముంబయికి చేరుకుంది. ఆమె విమానం నుంచి దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో ప్రవర్తన అధికారులు గమనించగా అనుమానం కలిగింది. దీంతో ఆమెను ఆపి వివరాలు అడిగి, లగేజీని తనిఖీ చేయాలని నిర్ణయించారు.

హర్ష సన్నీ తీసుకువచ్చిన ట్రాలీ బ్యాగ్‌ను అధికారులు తెరిపించి పరిశీలించగా, అందులో 12 ప్లాస్టిక్‌ ప్యాకెట్లు కనిపించాయి. ఆ ప్యాకెట్లలో ఉన్న పదార్థం మొత్తం ఆకుపచ్చరంగులో ఉండటంతో అది నిషేధిత మాదకద్రవ్యం కావచ్చని భావించిన అధికారులు ఎయిర్‌పోర్టులోనే ప్రాథమిక నార్కో పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో ఆ పదార్థం గంజాయిగా నిర్ధారించబడింది. మొత్తం ప్యాకెట్ల బరువు 11 కిలోలుగా తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ గంజాయి విలువ దాదాపు రూ.11.82 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. ఇంత భారీ పరిమాణంలో గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చి, ఎక్కడికి తరలించాలనుకున్నదీ, ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌లో మరెవరు ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

నిషేధిత మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ నిబంధనల కింద హర్ష సన్నీ ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఆమెను రిమాండ్‌ జైలుకు తరలించారు.

ఈ కేసు నేపథ్యంలో గంజాయి స్మగ్లింగ్‌ మార్గాలు, విదేశాల నుంచి భారతదేశానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా పద్ధతులపై సంబంధిత సంస్థలు మరింత నిఘా పెంచుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల లగేజీ తనిఖీలను కట్టుదిట్టం చేయాలని కస్టమ్స్‌, ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సమాచారం.

హర్ష సన్నీ 2025లో నిర్వహించిన Mrs కేరళ పోటీలో పాల్గొన్న మోడల్‌గా గుర్తింపు పొందిన విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. మోడలింగ్‌ రంగానికి చెందిన వ్యక్తి ఇలాంటి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో చిక్కుకోవడం పట్ల స్థానిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేసు పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.