దోమల నివారణలో నిర్లక్ష్యం.. ప్రజారోగ్యం ప్రమాదంలో

వర్షాకాలం మొదలవుతుండగా దోమల బెడద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు డెంగీ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం మళ్లీ తలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ముందస్తు చర్యలు అత్యవసరమైన ఈ సమయంలో పురపాలక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 125 డెంగీ, 3 మలేరియా కేసులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 695 డెంగీ, 29 మలేరియా కేసులు వెలుగుచూశాయి. వర్షాకాలం ఆరంభంలోనే దోమల నివారణ చర్యలు చేపడితే ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి పట్టణాల్లో అలాంటి కదలిక కనిపించడం లేదని ఆరోగ్యవర్గాలు సూచిస్తున్నాయి.

దోమల నివారణ పేరుతో ప్రతి ఏడాది లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారికంగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్నది ప్రజల వాదన. పురపాలకాల్లో జనాభాకు అనుగుణంగా యంత్ర పరికరాలు కూడా లేవని స్థానిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రత్యేక శ్రేణి కలిగిన ఆదోని పట్టణంలో ఇప్పటికీ ఫాగింగ్‌ యంత్రం లేకపోవడం విశేషం. ఇక్కడ పిచికారీ యంత్రాలు 36 మాత్రమే ఉన్నాయి.

కర్నూలు నగరంలో పిచికారీ యంత్రాలు 40, ఫాగింగ్‌ యంత్రాలు 15 ఉన్నప్పటికీ వాటిలో ఐదు పనిచేయడం లేదని సమాచారం. నంద్యాలలో 22 స్ప్రేయర్లు, 8 ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నప్పటికీ అక్కడే డెంగీ కేసులు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మిగనూరులో 40 స్ప్రేయర్లు, 3 ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నా, దోమల సమస్య తగ్గకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

పూడికతీత, కాల్వల శుభ్రత వంటి ప్రాథమిక పనుల కోసం కూటమి ప్రభుత్వం ఆరంభంలోనే పురపాలకాలకు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ, చాలా పట్టణాల్లో ఆ నిధులు వినియోగం కానట్లుగా కనిపిస్తున్నాయి. దీనితో ప్రజారోగ్యంపై స్థానిక సంస్థల ఆసక్తి ఎంతమేరలో ఉందో స్పష్టమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

నిపుణుల సూచనల ప్రకారం, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వారానికొకసారి యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాలి. కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పారేలా చర్యలు తీసుకోవాలి. దోమ గుడ్డు నుంచి పూర్తిస్థాయి దోమగా మారేందుకు సుమారు 7–8 రోజులు పడుతుంది. ఈ వ్యవధిలో, ముఖ్యంగా మొదటి రోజు, చివరి రోజు తప్పనిసరిగా స్ప్రే చేస్తే దోమల పెరుగుదలను గణనీయంగా అరికట్టవచ్చని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ, పురపాలక చర్యలు సరిపోకపోవడంతో ప్రతి కుటుంబం స్వంతంగా దోమల నివారణకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాల్సి వస్తోంది. ఒక్కో కుటుంబం నెలకు సుమారు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. లిక్విడ్‌లకు సుమారు రూ.300, బ్యాట్‌కు రూ.350–700, కాయిల్స్‌కు రూ.100తో పాటు ఇతర ఖర్చులు కూడా భరించాల్సి వస్తోంది.

దోమల వల్ల వచ్చే విషజ్వరాలు ప్రబలితే పరిస్థితి మరింత భారమవుతోంది. అవుట్‌పేషెంట్‌గా చికిత్స తీసుకుంటే కనీసం రూ.200 ఖర్చవుతుండగా, ఆస్పత్రిలో చేరాల్సి వస్తే రక్తపరీక్షలు, అడ్మిషన్‌ తదితరాలతో కలిపి ఒక్కో రోగికి రూ.25 వేలకుపైగా భారమవుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. దోమల నివారణలో ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.