నయనతార రికార్డు బద్దలు కొట్టిన రష్మిక మందన్న…

సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నేషనల్ క్రష్

సినీ పరిశ్రమలో నెంబర్ వన్ స్థానానికి పోటీ హీరోల మధ్య మాత్రమే కాదు, హీరోయిన్ల మధ్య కూడా తీవ్రంగా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వసూళ్లు, గ్లామర్ మాత్రమే కాకుండా పారితోషికం విషయంలోనూ నాయికలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి అనే ఖ్యాతిని లేడీ సూపర్ స్టార్ నయనతార దక్కించుకుంది. ఒక్కో సినిమాకు సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు తీసుకుంటూ టాప్ స్థాయిని నిలబెట్టుకుంది.

అయితే 2026 నాటికి ఈ సమీకరణాలు మారిపోయాయి. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న, నయనతార రికార్డును అధిగమించి సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న తన రాబోయే బాలీవుడ్ చిత్రం ‘ కాక్టెయిల్ 2’ కోసం ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే, భారతీయ సినిమా చరిత్రలో ఒక దక్షిణాది నటి ఇంత భారీ పారితోషికం అందుకోవడం విశేషంగా భావించాల్సిందేనని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రష్మిక మార్కెట్ విలువ ఈ స్థాయికి చేరడానికి ఆమె నటించిన వరుస విజయాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రణబీర్ కపూర్‌తో చేసిన ‘ Animal’, అల్లు అర్జున్‌తో నటించిన ‘ పుష్ప 2’, బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ చావా ’ వంటి చిత్రాల భారీ విజయాలతో రష్మికకు ఉత్తర నుంచి దక్షిణం వరకు డిమాండ్ పెరిగింది. సినిమాలతో పాటు పలు టాప్ అంతర్జాతీయ బ్రాండ్లకు రష్మిక ఎండార్స్‌మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

‘ పుష్ప : ది రైజ్ (Part 1)’ చిత్రానికి రష్మిక తీసుకున్న పారితోషికం సుమారు రూ.2 కోట్లు మాత్రమే. అయితే ‘శ్రీవల్లి’ పాత్రతో వచ్చిన క్రేజ్, ఆ తరువాత వరుస హిట్లు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను గణనీయంగా పెంచాయి. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే రూ.2 కోట్ల నుంచి రూ.15 కోట్ల స్థాయికి చేరడం రష్మిక స్టార్డమ్ ఎంత వేగంగా పెరిగిందో చూపిస్తున్నదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్ల పారితోషికాలపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. చెన్నై బ్యూటీ త్రిష సుమారు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దళపతి విజయ్ ‘GOAT’, చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాల విజయాల తర్వాత ఆమె ఈ రేంజ్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

సమంత రూత్ ప్రభు ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు టాక్. వెబ్ సిరీస్‌లు, పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘తండేల్’, ‘రామాయణం’ వంటి చిత్రాలతో సాయి పల్లవి డిమాండ్ పెరిగింది. ఆమె పారితోషికం సుమారు రూ.6 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి అయితే రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే, ఒకప్పుడు భారీ పారితోషికాలు ప్రధానంగా బాలీవుడ్ నటీమణులకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇప్పుడు సౌత్ బ్యూటీలు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న సృష్టించిన ఈ కొత్త బెంచ్‌మార్క్, రాబోయే రోజుల్లో హీరోయిన్ల స్టార్డమ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.