రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి, అక్టోబర్ 05: తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన కేసులో అలిపిరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాలపై దర్యాప్తు చేపట్టిన అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన గుండుబోయన నరేష్ (31) తాను నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుని, డి. లోకేష్, ఎన్. సత్తిలకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగ ఖర్చుల పేరుతో లోకేష్ నుంచి రూ.4,95,000/-, సత్తి నుంచి రూ.2,00,000/- బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు తీసుకున్న అనంతరం నరేష్ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేసినట్లు బాధితులు ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంపై లోకేష్ అక్టోబర్ 02, 2026న అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు సందర్భంగా నిందితుడు నరేష్ ప్రస్తుతం సుమారు ఒక సంవత్సరం కాలంగా నెల్లూరు హోంగార్డ్ యూనిట్‌లో విధులకు గైర్హాజరుగా ఉన్నట్లు (ఆబ్సెంట్‌గా ఉన్నట్లు) పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా అక్టోబర్ 05, 2026 ఉదయం ఎస్వీఆర్‌ఆర్‌జీజీ హాస్పిటల్ జంక్షన్ వద్ద గుండుబోయన నరేష్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టప్రకారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల దర్యాప్తులో నరేష్ గతంలోనూ ఉద్యోగాల పేరుతో డబ్బులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్న కేసుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి నుంచి రూ.7,00,000/- స్వీకరించినట్లు ఫిర్యాదు రావడంతో, అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అలాగే బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో రూ.17,50,000/- స్వీకరించినట్లు నమోదైన మరో కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసపూరిత చర్యలపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులు లేదా మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సూచించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్లు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఉద్యోగ మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.













