రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని మంగంపేట బైరైటీస్ గనులను మూసివేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. దేశానికి అత్యంత కీలకమైన, పునరుత్పత్తి చేయలేని ఈ అరుదైన ఖనిజ సంపదను భారీ స్థాయిలో విదేశాలకు తరలించడం ద్వారా జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కమిటీ పేర్కొంది.
మంగంపేట బైరైటీస్ గనుల పరిస్థితి, బల్క్ టెండర్ల విధానం, ఖనిజ నిల్వలు, ఎగుమతులు, ఏపీఎండీసీ విధానాలు, మైన్ క్లోజర్ ప్రతిపాదనల వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేసేందుకు ఇటీవల విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ ఏర్పడినట్లు మంగంపేట బైరైటీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి తెలిపారు.

ఈ కమిటీలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర తదితరులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ 2026 సెప్టెంబర్ 3న మంగంపేట బైరైటీస్ ప్రాంతాన్ని సందర్శించి గనుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం కమిటీ తరఫున మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పలు అంశాలను మీడియాకు వెల్లడించారు.
మంగంపేట, ఓబులవారిపల్లె, గోవిందపల్లి ప్రాంతాల్లో బైరైటీస్ ఖనిజ నిల్వలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో గుర్తించాయి. ఈ ప్రాంతంలో సుమారు 74 మిలియన్ టన్నుల వరకు బైరైటీస్ నిల్వలు ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా దేశ ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్ర ఆదాయానికి, స్థానిక ఉపాధికి కీలకంగా ఉన్న ఈ గనులను ఇప్పుడు మూసివేసే దిశగా చర్యలు చేపట్టడం ప్రమాదకర పరిణామమని కమిటీ అభిప్రాయపడింది.

ప్రస్తుతం కూడా A, B గ్రేడ్లలో సుమారు 25 లక్షల టన్నుల ఖనిజం, C, D మరియు ఇతర గ్రేడ్లలో గణనీయమైన బైరైటీస్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. కోట్లాది టన్నుల ఓవర్‌బర్డెన్ కూడా గనుల ప్రాంతంలో పేరుకుపోయి ఉంది. అయినప్పటికీ మైన్ క్లోజర్ పేరుతో గనుల కార్యకలాపాలను క్రమంగా తగ్గించి రెండేళ్లలో మంగంపేట గనులకు ముగింపు పలికే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీఎండీసీ ఆధ్వర్యంలో 2025 జనవరి 24న C, D మరియు వేస్ట్ గ్రేడ్ బైరైటీస్‌ను భారీ పరిమాణంలో విక్రయించేందుకు బల్క్ టెండర్ విడుదల చేశారు. ఈ విధానమే మంగంపేట బైరైటీస్ నిల్వలు వేగంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా మారిందని కమిటీ పేర్కొంది. దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల బైరైటీస్కు ఐదేళ్ల కాలపరిమితితో ఒప్పందం కుదుర్చగా, అందులో అత్యధిక భాగాన్ని ఎంప్రదా మైన్స్ అనే ఒకే సంస్థ దక్కించుకున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది.
2025 ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున 2030 ఫిబ్రవరి వరకు ఖనిజాన్ని సరఫరా చేయాల్సి ఉంటుందని సమాచారం. ఐదేళ్లపాటు ధరను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించకుండా ఒకే ధరను కొనసాగించేలా నిబంధనలు పెట్టడం అత్యంత ఆశ్చర్యకరమని కమిటీ వ్యాఖ్యానించింది.
గతంలో బైరైటీస్ ధరలను తరచుగా సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించేవారని కమిటీ గుర్తుచేసింది. 2015 తర్వాత ధరల సమీక్షను వార్షిక పద్ధతిలోకి మార్చినా, ఇప్పుడు 2025 ఒప్పందంలో ఐదేళ్లపాటు ఒకే ధర అమలులో ఉండేలా చేయడం ప్రభుత్వ రంగ సంస్థ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. రిజర్వ్ ధరకు స్వల్ప మొత్తమే అదనంగా బిడ్ వేసి ఒకే సంస్థ భారీ పరిమాణంలోని బైరైటీస్‌ను దక్కించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని కమిటీ అభిప్రాయపడింది.
టెండర్లో పాల్గొనే సంస్థకు మూడు సంవత్సరాల ఎగుమతి అనుభవం, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్షల మెట్రిక్ టన్నుల బైరైటీస్ ఎగుమతి, ఎగుమతుల ద్వారా వందల కోట్ల రూపాయల టర్నోవర్, సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం వంటి కఠినమైన అర్హత నిబంధనలు విధించారని కమిటీ పేర్కొంది. దీంతో చిన్న, మధ్యతరహా దేశీయ పరిశ్రమలు పోటీలో పాల్గొనే అవకాశమే లేకుండా పోయిందని, ఒక నిర్దిష్ట పెద్ద కంపెనీకి అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించారా అన్న అనుమానం వ్యక్తమైంది.
బైరైటీస్ సహజంగా లభించే బేరియం సల్ఫేట్ ఖనిజమని, అధిక నిర్దిష్ట గురుత్వం, తక్కువ కరిగే స్వభావం, రసాయన స్థిరత్వం వంటి లక్షణాల కారణంగా చమురు, సహజవాయువు అన్వేషణలో, ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోందని కమిటీ వివరించింది. దేశ ఇంధన భద్రతతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యూహాత్మక ఖనిజమని స్పష్టం చేసింది.
దేశంలోని అత్యంత కీలకమైన బైరైటీస్ నిల్వలు మంగంపేట ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, ఈ సహజ ఖనిజాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని కమిటీ పేర్కొంది. ఒకసారి నిల్వలు పూర్తిగా తరిగిపోతే తిరిగి పునరుత్పత్తి చేయలేమని హెచ్చరించింది. ఈరోజు భారీగా ఎగుమతి చేస్తే, రేపు దేశీయ అవసరాల కోసం అదే బైరైటీస్‌ను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
2015 ప్రాంతంలో మంగంపేటలో సుమారు 49 మిలియన్ టన్నుల బైరైటీస్ నిల్వలు ఉన్నట్లు అంచనాలు ఉండగా, 2024 నాటికి అవి సుమారు 23 మిలియన్ టన్నులకు పడిపోయినట్లు సమాచారం. అంటే పదేళ్లలోనే సగానికి పైగా నిల్వలు తగ్గడం ఆందోళనకరమని కమిటీ పేర్కొంది.
ప్రభుత్వ సహజ వనరులను కేటాయించేటప్పుడు పారదర్శకత, సమాన అవకాశాలు, ప్రజా ప్రయోజనం ప్రధాన ప్రమాణాలుగా ఉండాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పొందుపరిచిన సమానత్వ సూత్రం, ఆర్టికల్ 39(b)లో పేర్కొన్న ప్రజల ఉమ్మడి ప్రయోజనాల సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని కమిటీ గుర్తుచేసింది. మంగంపేట బైరైటీస్ విషయంలో భారీ ఖనిజ సంపదను ఒకే ప్రైవేట్ సంస్థకు దీర్ఘకాలికంగా అప్పగించడం, ధరను ఐదేళ్లపాటు స్థిరపరచడం, ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయ













