తిరుపతి నగరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై నడిరోడ్డుపై జరిగిన దాడి కలకలం రేపింది. రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోనే యువతి కుటుంబ సభ్యులు వారిని అడ్డగించి దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

దాడి సమయంలో యువతి మెడలోని తాళిబొట్టును తెంచడంతో పాటు యువకుడు చందుపై కూడా దాడికి పాల్పడినట్లు సమాచారం. భయాందోళనకు గురైన నవ దంపతులు సమీపంలోని ఓ కార్యాలయంలోకి పరుగెత్తి ఆశ్రయం పొందారు. అనంతరం స్థానికుల సహాయంతో వారిని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు కోచింగ్ సెంటర్‌లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెళ్లి వరకు దారితీసింది. ఈ నెల 19న ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

అయితే శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చందు తల్లి, పెద్దమ్మ, మేనమామలను మూడు రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తిరుపతికి వస్తుండగానే తమపై దాడి జరిగిందని నవ దంపతులు పోలీసులకు వాపోయారు. దాడి ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నవ వధువు స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి, కేసు వివరాలను రాయచోటి పోలీసులకు పంపించారు. మిస్సింగ్ కేసు, దాడి ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లు విచారణ కొనసాగిస్తున్నాయి.