రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి పారామెడికల్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. స్టైఫండ్ చెల్లించాలని, అకాడమిక్ కోర్సును సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై అలిపిరి పోలీసుల దాడి జరిగినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
శనివారం తిరుపతి పారామెడికల్ కళాశాల విద్యార్థులు, SFI తిరుపతి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రూయ నుంచి అలిపిరి వరకు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో వెలుగులోకి తీసుకురావడానికి ఈ ర్యాలీ చేపట్టినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఆందోళన జరుగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగిన పోలీసు అధికారి వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా లాక్కెళ్లినట్లు సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థినిలు అని కూడా చూడకుండా వారి జుట్టు పట్టుకుని లాగడం, తోసిపుచ్చడం వంటి చర్యలు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పారామెడికల్ విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్యయుక్తంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఈ విధంగా పోలీసుల దౌర్జన్యం అంగీకారయోగ్యం కాదని వారు పేర్కొంటున్నారు.
తిరుపతి జెన్ జీ (విద్యార్థులు)పై పోలీసుల దాడులు ఖండించండి : ఎస్ఎఫ్ఐ
తిరుపతిలో విద్యార్థులపై జరిగిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. పారామెడికల్ విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆందోళనలను అణచివేయడానికి బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.













