రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీలో ఉన్న టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలో బాయిలర్ పేలుడు ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం, పలువురు గాయపడటం అత్యంత విషాదకరమని వారు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సిఐటియు కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు C H చంద్రశేఖర్ , R వెంకటేష్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు.
పరిశ్రమల్లో ఉత్పత్తి, లాభాలకు ఇచ్చే ప్రాధాన్యతను కార్మికుల ప్రాణాలకు ఇవ్వకపోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని నాయకులు అభిప్రాయపడ్డారు. భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టి కార్మికులతో పనిచేయించడం ద్వారా వారి ప్రాణాలతో చెలగాటమాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం సరిపోదని, ప్రతి మృత కార్మికుడి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేస్తోందని నాయకులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం పూర్తిగా అందించడంతో పాటు ప్రతి క్షతగాత్రుడికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబంలో అర్హులైన ఒకరికి యాజమాన్యం తక్షణమే ఉద్యోగం కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మృతుల పిల్లల విద్య, కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత వహించాలని వారు సూచించారు. కేవలం పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోకుండా బాధిత కుటుంబాలకు దీర్ఘకాలికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బాయిలర్ పేలుడుకు అసలు కారణాలు ఏమిటి, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా, బాయిలర్ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన యాజమాన్యం, అధికారులు ఎంతటి వారైనా విచారించేలా కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు.
పరిశ్రమల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు Kodur మండల కన్వీనర్ P John Prasad పాల్గొన్నారు.













