రాయలసీమ న్యూస్, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన పదవులు, బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, మాజీ APSRTC వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ మిడ్డెల హరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని, ఈ కాలంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి APSRTC వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ గా, APCO డైరెక్టర్ గా, శ్రీకాళహస్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా తదితర బాధ్యతలు అప్పగించిన విషయాన్ని మిడ్డెల హరి తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన వ్యక్తిగత రాజకీయ నిర్ణయాల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని పదవులు, బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మిడ్డెల హరి లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి అధికారికంగా తెలియజేసినట్లు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించి, వివిధ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీడ్కోలు పలుకుతున్నట్లు మిడ్డెల హరి తెలిపారు.
మిడ్డెల హరి రాజీనామా లేఖ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరిన నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ రాజీనామాపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి ఆయన వైదొలగడం స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశమున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













