శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో శనివారం పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), శ్రీకాళహస్తి సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

కాలనీ మొత్తం చుట్టూ ముట్టడి చేసి ఇళ్ల వద్ద, వీధుల్లో, వాహనాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నివాసితుల వివరాలు, వారి వద్ద ఉన్న వాహనాల పత్రాలు, అద్దెకు ఉంటున్న వారి గుర్తింపు వంటి అంశాలను పోలీసులు సవివరంగా పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను పోలీసులు పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, అసంపూర్తి పత్రాలతో ఉన్న వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పోలీసులు ధృవీకరించారు.

కార్డన్ సెర్చ్ అనంతరం ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా రాజీవ్ నగర్ కాలనీ ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళా భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని పోలీసు అధికారులు వివరించారు.

మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, వేగ పరిమితుల పాటింపు ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. కాలనీల్లో అక్రమ కార్యకలాపాలు, నేరాలకు తావు లేకుండా ముందస్తు చర్యల భాగంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.