రాయలసీమ న్యూస్, తిరుపతి: రేణిగుంట: రేణిగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ శిరీష తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులకు బ్యాంకు చైర్మన్ జయచంద్రారెడ్డి సాదర స్వాగతం పలికారు. శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు కార్యకలాపాలను అతిథులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బ్యాంకు సేవలను పరిశీలించి, స్వయంగా ఖాతాదారుడిగా చేరారు. రేణిగుంట ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించేందుకు ఈ కొత్త శాఖ తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రేణిగుంట ప్రజలు, వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని భావిస్తున్నాను. గతంలో నేను చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ శాఖను ఏర్పాటు చేసినందుకు చైర్మన్ జయచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
కార్యక్రమంలో బ్యాంకు ఎండీ శివకుమార్‌రెడ్డి, మేనేజర్ వినోద్, బ్రహ్మానందరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, జడ్పీటీసీ సంధ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు 6వ శాఖ ప్రారంభంతో రేణిగుంట పరిసర ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలకు రుణాలు, పొదుపు ఖాతాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్త శాఖ ద్వారా బ్యాంకు వ్యాపారం విస్తరించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఉత్సాహం కలుగుతుందని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి.













