రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకోవడంతో క్యూలైన్లు విస్తరించాయి. సాధారణ సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి.
క్యూలైన్లు రింగురోడ్డుమీదుగా గోగర్భం డ్యామ్ వరకు సాగాయి. ఈ క్యూలో నిలుచున్న భక్తులకు సుమారు 16 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వదర్శన క్యూలైన్‌లోకి భక్తులను దశలవారీగా అనుమతిస్తూ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు.
శుక్రవారం ఒక్క రోజే శ్రీవారిని 72,703 మంది భక్తులు దర్శించుకున్నట్లు తితిదే వెల్లడించింది. అదే రోజు హుండీ ద్వారా రూ.4.02 కోట్ల నగదు కానుకలు లభించాయి. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 37,581గా నమోదైంది.
లడ్డూల విక్రయాల విషయంలో కూడా భారీ డిమాండ్ కనిపించింది. గురువారం మొత్తం 4.34 లక్షల మంది భక్తులు లడ్డూలను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్నప్రసాదాలను 2.42 లక్షల మంది స్వీకరించగా, వైద్యసేవలను 3,402 మంది భక్తులు పొందినట్లు సమాచారం.
భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలలో భద్రతా ఏర్పాట్లు, జనసంచారం నియంత్రణకు సంబంధించి తితిదే సిబ్బంది, పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో తాగునీరు, వెచ్చని పాలు, వైద్యసేవలు, శానిటేషన్ వంటి సౌకర్యాలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
వారాంతం, సెలవుదినాలు సమీపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణం ప్రారంభించి, తిరుమలలో అమల్లో ఉన్న నియమ నిబంధనలు, సూచనలను పాటించాలని తితిదే విజ్ఞప్తి చేస్తోంది.













