తిరుమల : తిరుమలలో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో కలిసి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలను ఆయన వివరించారు.

సెప్టెంబరు 15 నుంచి 22 వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు చైర్మన్ పేర్కొన్నారు. మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే కాకుండా, 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు.

ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల కాలంలో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించాయి. 21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేయగా, 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 33 లక్షల లడ్డూలు విక్రయించినట్లు వివరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి–తిరుమల మార్గంలో 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల–తిరుపతి మార్గంలో 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించినట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ చెప్పారు. ఆ రోజు ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను, పాలక మండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో ప్రత్యక్షంగా పర్యటించి భక్తులతో మాట్లాడినట్లు తెలిపారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంటూ, ముఖ్యమంత్రికి పాలక మండలి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు చైర్మన్ వివరించారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్ల వ్యయంతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసే పనులు చేపట్టినట్లు చెప్పారు. అలిపిరి సమీపంలో 50 ఎకరాల్లో శ్రీవారి భక్తుల కోసం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చిన 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించినట్లు తెలిపారు. గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా, జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయని చెప్పారు.

ఉత్తమ ప్రదర్శనలు చేసిన కళాబృందాలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ప్రతిరోజూ వాహనసేవలో నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో సన్మానించినట్లు తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలో చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయని, వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా హెచ్‌డీ నాణ్యతతో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడంతో పాటు ప్రముఖ పండితుల వ్యాఖ్యానాలు అందించినట్లు చైర్మన్ వివరించారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించినట్లు తెలిపారు.

భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు సిద్ధంగా ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందిని నియమించగా, గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించగా, సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించినట్లు చెప్పారు. భక్తులకు మరుగుదొడ్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు గరుడసేవ సందర్భంగా విశేష సేవలందించినట్లు పేర్కొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన టీటీడీ అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య స