తిరుపతి: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం స్వచ్ఛతా కార్యక్రమం సందడి చేసింది. సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా చీపురు పట్టి బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" కార్యక్రమం (స్వచ్ఛత హి సేవ)లో భాగంగా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ పారిశుధ్య మాస్ డ్రైవ్ నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బస్టాండ్‌లోకి చేరుకున్న ఆమె వెంటనే చీపురు చేతిలోకి తీసుకుని ప్రాంగణాన్ని ఊడ్చి మెరిపించారు. వీఐపీ సంస్కృతికి భిన్నంగా ప్రజల మధ్యే కలిసిమెలిసి పనిచేస్తూ స్వచ్ఛతపై తన కట్టుబాటును ప్రదర్శించారు.

స్వచ్ఛతా కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే నేరుగా బస్టాండ్‌లోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారులు, ప్రయాణికులతో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు.

“పరిశుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష”

అని ఆమె ప్లాస్టిక్ మహమ్మారిపై సమరభేరి మోగించారు.

“సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే పర్యావరణానికే కాదు.. మన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు! మన చుట్టూ ఉన్న పరిసరాలను నీట్‌గా ఉంచుకుంటేనే సీజనల్ రోగాలు, ఇతర రోగాలకు నో ఎంట్రీ!”

అని డాక్టర్ నెలవల విజయశ్రీ హెచ్చరించారు. సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని వంద శాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే మరువలేదు. నియోజకవర్గంలో ఉత్తమంగా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి, వారికి నమస్కరించి ప్రత్యేకంగా అభినందించారు. పరిశుభ్రత అనేది కేవలం అధికారుల పని కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె హితవు పలికారు.

కార్యక్రమానికి హాజరైన వారందరిచేత “స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ” చేయించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ క్లీనింగ్ ధమాకాలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛతా నినాదాలతో బస్టాండ్ పరిసరాలు మార్మోగగా, ప్లాస్టిక్ రహిత సూళ్ళూరుపేట లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.