రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయం పరిధిలో పరిపాలన సరిగా నడవడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మండలంలో విద్యా పరిపాలన బలహీనంగా మారిందని, దాంతో పాఠశాలల వ్యవస్థ దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొదటి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ పనితీరుపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పత్రాలపై సంతకాలకే పరిమితమై, పరిపాలనపై పట్టు సాధించడంలో విఫలమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు, పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.
మండల పరిధిలోని పలు పాఠశాలల్లో కొంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవడంలో మొదటి మండల విద్యాశాఖ అధికారి వెనకడుగు వేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్ల శాసనబద్ధత దెబ్బతింటోందని ఉపాధ్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మొదటి మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్య వైఖరి కారణంగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పరిధిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు, పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాలల నిర్వహణలో గందరగోళం ఏర్పడుతోందని వారు అంటున్నారు.
ఉప విద్యాశాఖ అధికారి సూచనలను మొదటి మండల విద్యాశాఖ అధికారి పట్టించుకోవడం లేదని, దాంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉపాధ్యాయుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పై అధికారుల సూచనలు అమల్లోకి రాకపోవడంతో క్రమశిక్షణ సడలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తానికి మొదటి మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్య ధోరణి వల్ల కార్యాలయం పరిధిలో పలువురు ఉపాధ్యాయుల ఆగడాలను నియంత్రించలేని పరిస్థితి నెలకొన్నదని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే విద్యా వ్యవస్థలో పరిపాలన పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
నాయుడుపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పరిధిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నారు. మండల స్థాయిలో పరిపాలనను గాడిలో పెట్టి, విద్యా వ్యవస్థ ప్రతిష్టను కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.













