రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట డివిజన్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలో పలు మండలాల సహాయక ఇంజనీర్లు అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి అక్రమ ఆచరణలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే భావన ప్రజల్లో నెలకొంది.
పలు మండలాల సహాయక ఇంజనీర్లు ప్రభుత్వ పెద్దల పేర్లను వినియోగిస్తూ గుత్తేదారులపై, ఇతర శాఖల అధికారులపై నిర్బంధపు నగదు వసూళ్లకు దిగుతున్నారని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. అధికారుల పేర్లు చెప్పి ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గూడూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండదండలు తమకు పుష్కలంగా ఉన్నాయనే ధీమాతోనే ఈ సహాయక ఇంజనీర్లు సూళ్ళూరుపేట డివిజన్ స్థాయి అధికారులను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అండను ఆసరాగా చేసుకుని అనధికారిక సంపాదనకు తెరలేపారని విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే చిన్నపాటి పనులకు కూడా వేల రూపాయల అనధికారిక నగదు చెల్లిస్తేనే గుత్తేదారులకు, సంబంధిత శాఖల అధికారులకు పని నిర్ధారణ దస్త్రాలు అందజేస్తామని సహాయక ఇంజనీర్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఆరోపణలపై స్థానికంగా చర్చలు జోరుగా సాగుతున్నాయి.
సూళ్ళూరుపేట డివిజన్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలో పలు మండలాల సహాయక ఇంజనీర్లు కార్యాలయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ, నెలకు లక్షల రూపాయల అదనపు సంపాదనకు మార్గం సుగమం చేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సూళ్ళూరుపేట డివిజన్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలో సహాయక ఇంజనీర్ల అవినీతి ఆగడాలపై శాఖా పరమైన విచారణ చేపట్టి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిగి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి సరిదిద్దబడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.













