తిరుపతి: తిరుమల ప్రసిద్ధి గాంచిన “ఆకాశగంగ తీర్థం” ఆధారంగా రూపొందించిన ప్రత్యేక తపాలా కవర్‌ను భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న Tiruphex-2026 సందర్భంగా విడుదల చేశారు. ఈ కవర్‌కు బ్రహ్మంగారిమఠం వాసి, గోశాల బాల పెంచలయ్య (మఠం బాలు) ప్రాయోజకుడిగా వ్యవహరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానముల అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్. వెంకయ్య చౌదరి చేతుల మీదుగా ఈ ప్రత్యేక తపాలా కవర్‌ ఆవిష్కరణ జరిగింది. ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తపాలా జ్ఞాపికల రూపంలో నిలుపుదల చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా తపాలా శాఖ పేర్కొంది.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన గోశాల బాల పెంచలయ్య (మఠం బాలు)తో పాటు, కర్నూలు రీజినల్ తపాలా శాఖ అధికారి డా. వెన్నం ఉపేందర్, ప్రొద్దుటూరు అధినేత, Bharat Scientifics ప్రతినిధులు పాల్గొన్నారు. డా. వెన్నం ఉపేందర్‌కు ఈ సందర్భంగా సత్కారం లభించింది.

కార్యక్రమంలో ప్రసంగించిన డా. వెన్నం ఉపేందర్, తపాలా శాఖ కాలానుగుణంగా ఆధునిక సేవలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువవుతోందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

బ్రహ్మంగారు, వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రేష్ట జలపాతాలలో ఒకటైన స్వామి వారి పవిత్ర అభిషేక జలం ఉద్భవించే “ఆకాశగంగ తీర్థం” ప్రత్యేక తపాలా కవర్ కి ప్రాయోజకుడిగా వ్యవహరించే భాగ్యం దక్కింది.

బ్రహ్మంగారి మఠం వాసి గా ఈ భాగ్యం దక్కడం జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నాను.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరంగా తెలిపిన నా శిష్యుడు రైల్వే మెయిల్ సర్వీస్ లో కడప మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న జి నవీన్ బాబుకు, దశల వారీగా పై అధికారుల అప్రూవల్ కొరకు ఎంతగానో కృషిచేసిన ఏ జి డివిజన్ సూపరింటెండెంట్ ఆది నారాయణ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

రెండు రోజులపాటు తిరుపతిలో జరిగిన తపాలా కవర్లు, స్టాంపుల ప్రదర్శనకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తపాలా చరిత్ర, ప్రత్యేక కవర్లు, అరుదైన స్టాంపులపై ఆసక్తి చూపుతూ ప్రదర్శనను విజయవంతం చేశారు.

తిరుమల ఆకాశగంగ తీర్థం ఆధారంగా విడుదలైన ఈ ప్రత్యేక తపాలా కవర్‌ భక్తులకు, తపాలా జ్ఞాపికల సేకరణకారులకు విశేష ఆకర్షణగా మారింది. తిరుపతి ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇది మరొక గుర్తుగా నిలుస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.