రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో భక్తుల భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త బీమా పాలసీని అమలు చేయనుంది. ఇప్పటి వరకు తిరుమల పరిధిలో జరిగిన ప్రమాదంలో మరణించిన భక్తులకు రూ.3 లక్షల వరకు మాత్రమే బీమా రక్షణ ఉండేది. తాజా నిర్ణయంతో సహజ మరణం, ప్రమాద మరణం రెండింటికీ ప్రత్యేకంగా బీమా సౌకర్యం కల్పించబడుతోంది.
కొత్త పథకం ప్రకారం తిరుమలలో సహజ మరణం సంభవించిన భక్తులకు రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల వరకు బీమా రక్షణ లభించనుంది. ఈ బీమా సౌకర్యం కోసం భక్తులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత కూడా భక్తులపై ఉండదు. మొత్తం ప్రీమియం మొత్తాన్ని టీటీడీ స్వయంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి)కు చెల్లించనుంది. ఇందుకోసం టీటీడీ నుంచి ఎల్ఐసి కు రూ.2.12 కోట్లు చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఈ బీమా పథకం తిరుమలకు అలిపిరి నుంచి ప్రవేశించి, తిరిగి అలిపిరి వరకు ప్రయాణించే భక్తులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే అలిపిరి నుంచి కొండపైకి వెళ్లి, తిరిగి అలిపిరి వరకు వచ్చే ప్రయాణ కాలంలో జరిగే సహజ లేదా ప్రమాద మరణాలకు ఈ బీమా రక్షణ వర్తించనుంది.
అయితే ఈ పథకానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. తిరుమల కొండపై నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే భక్తులకు ఈ బీమా వర్తించదు. అలాగే ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాల్లో కూడా బీమా రక్షణ ఉండదు. తిరుమలలో సేవలందించే టీటీడీ ఉద్యోగులు, స్థానిక నివాసితులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రవాణాదారులు ఈ పథకం పరిధిలోకి రారు.
తిరుమల దర్శనానికి టికెట్ తీసుకున్న భక్తుల ఆధార్ వివరాలు, క్యూలైన్‌లో ఉన్న సాధారణ భక్తుల సమాచారాన్ని సాంకేతిక విధానాల ద్వారా ఎల్ఐసి డేటాబేస్‌లోకి పంపేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా తిరుమలలో ఉన్న సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే, సంబంధిత భక్తుల వివరాలు ఎల్ఐసి వద్ద అందుబాటులో ఉండి, బీమా క్లెయిమ్ ప్రక్రియ సులభంగా సాగేందుకు అవకాశం ఉంటుంది.
భక్తుల భద్రత, కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు ఉపశమనం కలిగించేలా ఉందని భావిస్తున్నారు.













