తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన గరుడ వాహన సేవను దృష్టిలో పెట్టుకుని తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రాకపోకల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రకటించింది.

ఈ నెల 18వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 20వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో టూవీలర్లకు ఎంట్రీ ఉండదు. ఈ కాలంలో భక్తులు తిరుపతి నుంచి RTC బస్సులు, TTD వాహనాలు, ఇతర ఫోర్ వీలర్ వాహనాల ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం RTC బస్సులను నిరంతరాయంగా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.

ద్విచక్ర వాహనదారులకు అసౌకర్యం కలగకుండా తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. బాలాజీ లింకు బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, SV మెడికల్ కాలేజీ గ్రౌండ్, ISKCON ఆలయ మైదానంలో టూవీలర్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. టూరిస్టు బస్సుల కోసం జూ పార్క్ రోడ్డులోని దేవలోకే , TRIDENT, మాంగో మార్కెట్ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఫోర్ వీలర్ వాహనాల కోసం భారతీయ విద్యాభవన్, అలిపిరి లింకు బస్టాండ్, SV మెడికల్ కాలేజీ గ్రౌండ్, SV ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లలో పార్కింగ్ కేటాయించారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 19న ముఖ్యమైన గరుడ వాహన సేవ నిర్వహించనుండటంతో లక్షలాది మంది భక్తులు తిరుపతి వస్తారని అంచనా వేస్తున్నాం. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలిపి ఉంచి, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నాం.

ఈ పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి భక్తులు TTD తిరుమలకు వెళ్లేందుకు RTC బస్సుల ఏర్పాట్లు చేశాం. గరుడ సేవ నాడు తిరుపతికి వివిధ ప్రదేశాల నుండి వచ్చే బస్సులను డైవర్ట్ చేస్తున్నాం. చిత్తూరు–మదనపల్లి వైపు నుంచి వచ్చే బస్సులను కాలూరు క్రాస్, RCపురం జంక్షన్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపునకు మళ్లిస్తున్నాం. చెన్నై, పుత్తూరు వైపు నుంచి వచ్చే బస్సులను సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపుకి మళ్లిస్తున్నాం. కడప, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే బస్సులను రమణ విలాస్ జంక్షన్, గాజులమండ్యం సర్కిల్, సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపుకి మళ్లిస్తున్నాం.

తిరుమలలో గరుడ సేవ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన మేరకు బందోబస్తు సిబ్బందిని మోహరించాలని SP సుబ్బారాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. విధులకు కేటాయించిన ప్రతి అధికారి, సిబ్బంది తమ విధి ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు.

ఇన్–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, నాలుగు మాడ వీధులు, ఆలయ పరిసరాల్లో భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, రద్దీ పెరిగే పరిస్థితులను ముందుగానే గుర్తించి వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. భక్తులు ఒకేచోట గుమిగూడకుండా క్యూలైన్లను క్రమబద్ధంగా నిర్వహించి, అత్యవసర మార్గాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసు శాఖ స్పష్టం చేసింది.

గరుడ సేవ బందోబస్తు సాధారణ పోలీసు విధి కాదు, శ్రీవారి భక్తులకు అందించే పవిత్రమైన సేవ. ప్రతి అధికారి, సిబ్బంది విధులకు కేవలం హాజరై ఉండటం కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.