రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటూ సెప్టెంబర్ 4న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఆ తరువాత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
సెప్టెంబర్ 5న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. వీధి ఉత్సవం సందర్భంగా యువకులు ఉట్లను కొడుతూ పాల్గొని భక్తులకు ఆనందాన్ని పంచుతారు.
ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు భక్తులు సేవల బుకింగ్, దర్శన ఏర్పాట్లను ముందుగానే పరిశీలించుకోవాలని దేవస్థానం సూచించింది.
అదేవిధంగా సెప్టెంబర్ 4న గోగర్భం డ్యామ్ సమీపంలోని ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పంచాభిషేకాలు చేస్తారు. అనంతరం అక్కడే ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీకృష్ణజన్మాష్టమి, ఉట్లోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున టీటీడీ భక్తులు నియమాలు, మార్గదర్శకాలను పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచిస్తోంది.













