రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 13న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో క్యూలైన్లు పొడవుగా కొనసాగుతున్నాయి.
ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని TTD అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు 13వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కారణంగా శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫారసు లేఖలను TTD స్వీకరించబోదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ముందురోజు సిఫారసు లేఖలు స్వీకరించే విధానం ఉండగా, ఈసారి 13వ తేదీకి సంబంధించిన బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో 12వ తేదీ సిఫారసు లేఖలు తీసుకోరు.
శ్రీవారి సర్వదర్శనానికి ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండగా, వరుస సెలవులు ప్రారంభమయ్యే 12వ తేదీ నుంచి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని TTD అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ దర్శనాల సమయాన్ని కాపాడేందుకు, భక్తుల క్యూలైన్లను సజావుగా నిర్వహించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులు తమ ప్రయాణ, దర్శన ఏర్పాట్లను ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలని TTD సూచించింది. 13వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో ఆ రోజు సాధారణ దర్శనాల ద్వారా మాత్రమే శ్రీవారి సేవలందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.













