రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి నగరంలో గూండాగిరి ఘటన చోటుచేసుకుంది. టౌన్ క్లబ్ సమీపంలో ఉన్న ఆర్.కె. మీట్ ఫుడ్స్ షాపును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల సమాచారం మేరకు, ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో దుండగులు ఆర్.కె. మీట్ ఫుడ్స్ షాపు వెనుక భాగం నుండి గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం షాపులో ఉన్న వాటర్ ట్యాంకులు, కుర్చీలు, ఫ్రిడ్జ్, హోటల్‌కు సంబంధించిన ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
దాడి జరిగిన విషయం ఉదయం తెలిసిన అనంతరం షాపు యజమాని కృష్ణతేజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన షాపుపై జరిగిన ఈ దాడికి సంబంధించి టౌన్ క్లబ్ యాజమాన్యంపై అనుమానాలు ఉన్నట్లు కృష్ణతేజ పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. టౌన్ క్లబ్ యాజమాన్యమే తమ హోటల్‌పై దాడి చేయించినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులో ధ్వంసమైన సామగ్రి, పగులగొట్టిన గోడను పరిశీలించి ఆధారాలు సేకరించారు. దుండగుల గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలియింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. టౌన్ క్లబ్ యాజమాన్యంపై వచ్చిన అనుమానాల దిశగా కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
తిరుపతి నగరంలో ఇలాంటి గూండాగిరి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల స్థానిక వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాపార స్థావరాలపై దాడులు, ఆస్తి ధ్వంసం వంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.













