రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి నగర పరిధిలో వాహనాలపై అనధికారికంగా ప్రదర్శిస్తున్న అధికారిక గుర్తింపు స్టిక్కర్లపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ప్రభుత్వ హోదాలు, పోలీసు, మీడియా గుర్తింపులను దుర్వినియోగం చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ శ్రీ భాస్కర్ నాయక్ సిబ్బందితో కలిసి ఈరోజు తిరుపతి నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారులు, కీలక కూడళ్ల వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేసి, అనుమతి లేకుండా వాహనాలపై ప్రదర్శిస్తున్న "On Govt Duty", "Police", "Press" వంటి అధికారిక హోదా, గుర్తింపు స్టిక్కర్లను గుర్తించి తొలగించారు.
ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం, మీడియా సంస్థల పేర్లు లేదా అధికారిక గుర్తింపులను అనుమతి లేకుండా వాహనాలపై వినియోగించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై మోటారు వాహన చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనధికారిక స్టిక్కర్లు, లోగోలు, గుర్తింపుల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను తప్పించుకోవడానికి, ప్రత్యేక హోదా ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
ప్రజలు తమ వాహనాలపై చట్టబద్ధమైన అనుమతి లేని అధికారిక స్టిక్కర్లు, లోగోలు లేదా గుర్తింపులను ఉపయోగించకుండా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసు శాఖ సూచించింది. ఇటువంటి ప్రత్యేక తనిఖీలు తిరుపతి నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో రాజీ ఉండదని, ప్రభుత్వ హోదాలను లేదా అధికారిక గుర్తింపులను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహిస్తామని ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు













