తిరుపతి నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నాలుగు కాళ్ల మండపం సమీపంలోని సాయి లక్ష్మి లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంపై ఈస్ట్ సిఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.

పోలీసుల దాడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు ఆర్గనైజర్లు, లాడ్జ్ మేనేజర్, ఒక విటుడు, ఒక విటురాలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పెనుమూరు కు చెందిన శ్రీనివాసులు, అతని భార్య ఒరిస్సా కు చెందిన సుకన్య ఈ వ్యభిచార వ్యవహారానికి ఆర్గనైజర్లుగా గుర్తించారు.

లాడ్జ్ మేనేజర్ హరికృష్ణ, విటుడు శ్రీకాంత్ తిరుపతి వాసులని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులు గతంలో కూడా ఇలాంటి కేసుల్లో పలుసార్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించినట్లు సమాచారం. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అదే ప్రవృత్తిని కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో పట్టుబడ్డ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నెంబర్ : 464/2026 గా కేసు నమోదు చేశారు. వ్యభిచారం నిర్వహణ, సహకారం, లాడ్జ్ ను ఇందుకు వేదికగా ఉపయోగించిన అంశాలపై సంబంధిత చట్టాల కింద నేరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన ఈస్ట్ సిఐ శ్రీనివాసులు, వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. లాడ్జ్ కార్యకలాపాలపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి.

తిరుపతి వంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ తరహా వ్యభిచారం కేసులు వెలుగులోకి రావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లాడ్జ్ లు, గెస్ట్ హౌస్ లపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.