తిరుపతి నగరంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే రైల్వే స్టేషన్, RTC బస్టాండ్ పరిసరాల్లోని హోటళ్లలో పరిశుభ్రత, ఆహార భద్రత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ముఖ్యంగా తిరుపతి RTC బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్‌లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు తిరుగుతున్న దృశ్యాలు అధికారులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.

జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాల మేరకు ఆదివారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు, యాత్రికులు అధికంగా ఉండే రైల్వే స్టేషన్, RTC బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని హోటల్స్, దుకాణాల్లో హెల్త్ ఆఫీసర్, లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిబ్బందితో కలిసి పరిశీలనలు చేపట్టారు.

తిరుపతి RTC బస్టాండ్ లోపల, బయట యాత్రికులకు ఆహార పదార్థాలు విక్రయించే 25 హోటల్స్, షాపులను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ విధానాలు, పరిశుభ్రత, ధరలు, ప్యాకింగ్ వివరాలు తదితర అంశాలను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో RTC బస్టాండ్‌లోని కొన్ని షాపులు MRP రేట్లకంటే ఎక్కువ ధరలకు ప్యాకింగ్ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి ఆరు షాపులపై కేసులు నమోదు చేసి, సంబంధిత యజమానులకు పెనాల్టీలు విధించారు.

అదేవిధంగా, మరికొన్ని చోట్ల ప్యాకింగ్ ఆహార పదార్థాలపై ముద్రించిన గడువు తేదీలు ముగిసిపోయినప్పటికీ వాటిని విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, విధి విధానాల ప్రకారం నాశనం చేశారు.

భక్తులు, యాత్రికులు ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లో ఆహార భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్, షాపులపై చర్యలు కొనసాగుతాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. తిరుపతి వంటి యాత్రా నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగనున్నట్లు సంబంధిత విభాగాలు స్పష్టం చేస్తున్నాయి.