తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు మరో నెల రోజుల్లో ముగియనుండగా, కొత్త బోర్డు చైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. ప్రస్తుత చైర్మన్ BR నాయుడు పదవీకాలం ముగింపు దశకు చేరుతుండగా, ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈసారి టీటీడీ చైర్మన్ పదవికి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు తమ తమ స్థాయిలో బలమైన ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ పోటీలో అనూహ్యంగా కొత్త పేరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మిక వేత్తగా పేరున్న శ్రీనివాస రామానుజంను టీటీడీ కొత్త చైర్మన్‌గా నియమించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తిరుమల గిరులపై నిత్యం లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగే ఈ పవిత్ర క్షేత్రంలో BR నాయుడు రెండేళ్ల పదవీకాలం అనేక వివాదాలతో సాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో, ఆధ్యాత్మిక భావజాలం కలిగిన పారిశ్రామికవేత్తను ఎంపిక చేయాలనే ఆలోచనతోనే శ్రీనివాస రామానుజం పేరును పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రి నాయుడు. చిత్తూరు జిల్లా వాసి అయిన ఆయన, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జియ్యర్ స్వామి సమక్షంలో రామానుజ మతాన్ని స్వీకరించిన తర్వాత తన పేరును శ్రీనివాస రామానుజం గా మార్చుకున్నట్లు సమాచారం. ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిగా, బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

2024 ఎన్నికలకు ముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన హోమం పూర్తిగా శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలోనే జరిగినట్లు తెలిసింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు, టీడీపీ నేతల మధ్య రాయబారిగా లోకాద్రి నాయుడు వ్యవహరించారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అలాగే, 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదిరే ప్రక్రియలో కూడా లోకాద్రి నాయుడు అలియాస్ శ్రీనివాస రామానుజం కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైకి బీజేపీ అనుకూలవాదిగా కనిపించినా, టీడీపీపై ఉన్న అతని మక్కువ, ఆ పార్టీ విజయం కోసం చేసిన ప్రయత్నాలే ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవికి ఆయన పేరు ముందుకు రావడానికి ప్రధాన కారణాలుగా రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి.

అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. టీటీడీ కొత్త చైర్మన్ నియామకంపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని భావిస్తున్నారు.