రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా అలిపిరి వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని బధిరుల ఐటీఐ కళాశాలలో సిబ్బంది అమానుష ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. దివ్యాంగులైన విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వారిపై శారీరక, మానసిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కళాశాలలో చదువుతున్న సుమారు 175 మంది విద్యార్థులకు రోజూ మూడు పూటల భోజనం తయారీ బాధ్యతను అదే విద్యార్థులపై మోపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే విద్యార్థులను నిద్రలేపి వంటపనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువుకోడానికి వచ్చిన తమను వంట పనులకు ఉపయోగించొద్దని చెప్పినప్పుడు సిబ్బంది తిట్లు, బెదిరింపులు, దాడులకు కూడా పాల్పడుతున్నారని వారు చెబుతున్నారు.
విద్యార్థుల వాదన ప్రకారం, వంటశాలలో కూరగాయలు కోయడం, అన్నం, కూరలు వండడం, పాత్రలు తోమడం వంటి పనులన్నీ వారితోనే చేయిస్తున్నారని, ఇది రోజువారీ వ్యవహారంగా మారిందని అంటున్నారు. పనులు చేయలేమని ఎదురు మాట్లాడితే సిబ్బంది తీవ్రంగా దుర్భాషలాడుతూ, కొట్టే స్థాయికి దిగజారుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సిబ్బంది వేధింపులు భరించలేకపోయిన దివ్యాంగ విద్యార్థులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని వీడియోల రూపంలో రికార్డు చేశారు. తాము వంటపనులు చేస్తున్న దృశ్యాలు, సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరును చిత్రీకరించి నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపినట్లు విద్యార్థుల వర్గాలు చెబుతున్నాయి.
ఇక విద్యార్థుల తల్లిదండ్రులపైనా సిబ్బంది అసభ్యకర పదజాలంతో దూషణలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులైన తమ పిల్లలను కళాశాలకు చదువుకోడానికి పంపితే, అక్కడ వెట్టిచాకిరి చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని దివ్యాంగ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు TTD ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. బధిరుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న ఈ ఐటీఐలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. TTD అధికారులు ఈ విషయంపై ఏ చర్యలు తీసుకుంటారన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.













