తితిదే నకిలీ వెబ్‌సైట్‌ ను విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. అధికారిక ఆన్‌లైన్ సేవలను పోలి ఉండేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారని తితిదే పేర్కొంది. కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులతో నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ నకిలీ వెబ్‌సైట్‌లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు గమనించామని తితిదే వెల్లడించింది. 

దర్శన టికెట్ల పేరుతో భక్తుల నుంచి నగదు వసూలు చేయడం, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఈ నకిలీ వెబ్‌సైట్ ఉద్దేశమని దేవస్థానం పేర్కొంది. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. 

తితిదే సేవలు, దర్శనం, వసతి, ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి భక్తులు అధికారిక తితిదే వెబ్‌సైట్‌, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనధికారిక వెబ్‌సైట్లు, లింకులను నమ్మి మోసపోవద్దని సూచించింది.