రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి:- బీజేపీకి అనుకూలంగా ఓటు చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించి, నినాదాలు చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైల్వే కోడూరు పట్టణంలోని టోల్ గేట్ సమీపంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు కలిసి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, లౌకిక తత్వం, మతసామరస్యం కాపాడాలని, మతోన్మాదం నశించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని, ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు అర్పించి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జి గోసాల దేవి, వైఎస్ఆర్ సిపి రైల్వే కోడూరు పట్టణ అధ్యక్షుడు చెన్నం చెట్టు రమేష్, రాష్ట్ర నాయకులు మందల నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కదిరి గాండ్ల శాంతయ్య, సిపిఎం పార్టీ చిట్వేల్ మండల కన్వీనర్ పందికాళ్ల మణి, సిపిఐ నాయకుడు జయచంద్ర తదితరులు హాజరయ్యారు.

నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం ఉండేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కును కాపాడటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 13 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, సర్ విధానం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని వారు ఆరోపించారు.
ముగ్గురు కమిటీ సభ్యుల్లో ఇద్దరు సభ్యులు మెజార్టీ నిర్ణయాలను అమలు చేయకుండా, 14 సార్లు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలిపినా, ఏకపక్షంగా నిర్ణయాలు అమలు చేశారని వారు విమర్శించారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాత వైఖరి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలంటే బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను వెంటనే బర్తరఫ్ చేసి రాజ్యాంగాన్ని కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మరింత భారీ స్థాయిలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
కేంద్రంలో బిజెపి చేస్తున్న అన్యాయంపై టిడిపి, జనసేన కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం చిట్వేల్ నాయకులు ఓబిలు పెంచలయ్య, మల్లారపు గురయ్యా, కె శంకరయ్య, రామకృష్ణ, కోడూరు సిపిఎం నాయకులు లింగాల యానాదయ్య, పి జాన్ ప్రసాద్, బి రాజశేఖర్, నాగిపోగు పెంచలయ్య, సిపిఐ నాయకులు దార్ల రాజశేఖర్, చింతల పూరి నాగమ్మ, ఎం గంగాధర్, ఎం జయరామయ్య, కే గోపాల్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ అహ్మద్, రమేష్, వైఎస్ఆర్ సిపి నాయకులు మస్తానయ్య, ముజీబు, శంకరయ్య, కరిముల్లా, పి సుబ్బరాయుడు, ఆంజనేయులు, బివి రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ లతీఫ్, డివైఎఫ్ఐ నాయకుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.













