రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు ₹6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP ) పోరుమామిళ్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కడప విభాగ్ కన్వీనర్ అభిలాష్ మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యను మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలులో పారదర్శకత లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని అభిలాష్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ పోరుమామిళ్ల శాఖకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సమస్య పరిష్కారం వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏబీవీపీ నాయకులు తెలిపారు.













