రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బద్వేలు పట్టణంలోని ప్రధాన రహదారులపై పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. కడప జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, బద్వేలు సీఐ ఆధ్వర్యంలో గురువారం చికెన్ షాపుల యజమానులకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
బద్వేలు టౌన్‌లోని ఫోర్ రోడ్స్ జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న రహదారిపై వరుసగా ఉన్న చికెన్ షాపుల యజమానులను పోలీస్ అధికారులు పిలిపించారు. సీఐ స్వయంగా వారితో సమావేశమై ట్రాఫిక్ సమస్యలపై వివరణ ఇచ్చారు. షాపుల ముందు కస్టమర్లు తమ బైకులు, ఆటోలను రోడ్డుపైనే నిలిపేయడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, ప్రజా రవాణాకు పెద్ద అంతరాయం కలుగుతోందని యజమానుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కొన్ని ముఖ్య నిబంధనలను స్పష్టంగా తెలియజేసింది. ఇకపై చికెన్ షాపుల ముందు కస్టమర్ల వాహనాలను రహదారిపై నిలిపేందుకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా షాపుల యజమానులే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వాహనాల పార్కింగ్‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించే వారిపై చట్టపరమైన న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై షాపుల యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకుంటామని, ట్రాఫిక్ నియమాలను పాటించేందుకు సహకరిస్తామని పోలీసులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం... ప్రాణాలను కాపాడుకుందాం
అని పిలుపునిస్తూ, సురక్షితమైన ప్రయాణం కోసం ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. రహదారులపై వాహనాలు ఇష్టానుసారంగా నిలిపితే ఇకపై ఎలాంటి సడలింపు ఉండదని, అవసరమైతే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
బద్వేలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజా రవాణా సాఫీగా సాగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు. చికెన్ షాపుల యజమానులు, కస్టమర్లు కలిసి సహకరిస్తే రహదారులు మరింత సురక్షితంగా మారతాయని అధికారులు పేర్కొన్నారు.













