రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బద్వేల్ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆరోపించింది. వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్, పట్టణ కార్యదర్శి ఎస్కే ఆదిల్ పాల్గొన్నారు. వీధి కుక్కల నియంత్రణపై మున్సిపల్ అధికారుల వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు.
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయని, వివిధ పనుల నిమిత్తం వీధుల్లో తిరిగే ప్రజలపై, ముఖ్యంగా చిన్నారులపై తరచూ దాడులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. కుక్కల దాడులతో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా, వీధి కుక్కలను నియంత్రించేందుకు గానీ, పట్టణం వెలుపలికి తరలించేందుకు గానీ మున్సిపల్ పాలకవర్గం ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని డివైఎఫ్ఐ నాయకులు విమర్శించారు.
పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంపై కన్నా, మున్సిపల్ అధికారులు అధిక పనులు విధించడం, పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాను నింపుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని వారు ఆరోపించారు. ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
వీధి కుక్కల కాటుతో వచ్చే రేబిస్ వ్యాధి ప్రమాదం ఎప్పటికప్పుడు పొంచి ఉందని, ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు అప్రమత్తమై శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. వీధి కుక్కలను పట్టణం నుంచి తరలించడం, అవసరమైన టీకాలు, వైద్య చర్యలు, నియంత్రణ చర్యలను అత్యవసరంగా అమలు చేయాలని కోరింది.
సెప్టెంబర్ 9, 2026న మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జరిగిన తాజా ఘటనను డివైఎఫ్ఐ నాయకులు ప్రస్తావించారు. మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చిన్న పాప ఆడుకుంటుండగా, ఒక వీధి కుక్క ఆమెను వెంబడించి దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయని, ఈ సంఘటన పట్టణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించిందని తెలిపారు.
వీధి కుక్కల సమస్యను తక్షణం పరిష్కరించకపోతే, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసే దిశగా ఆలోచిస్తున్నామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు సుధాకర్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













